జగన్ కు రఘురామకృష్ణరాజు భారీ సవాల్!

వాస్తవం ప్రతినిధి: నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ సవాల్ విసిరారు. అమరావతి అంశం రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే జగన్‌ను 2 లక్షల భారీ మెజారిటీతో ఓడించి తీరతానంటూ స్పష్టం చేశారు. ఎంపీ పదవి నుంచి తననెవరు తొలగించలేరని, పార్టీ నుంచి కూడా బహిష్కరించలేరని స్పష్టంచేశారు.

ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జడ్జి స్వామి రాసిన పుస్తకంలోని అంశాలను సాక్షి దిన పత్రిక ప్రచురించడం సమంజసం కాదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం మత సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని రఘురామ స్పష్టంచేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మతం ప్రకారమే తన పదవిని వేరే ఎంపీకి ఇచ్చారని, అందులో గొడవవేమీ లేదని అన్నారు.

బడా కాంట్రాక్టర్లకు ఇసుక టెండర్లను అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ వ్యక్తులెవరో తెలుసుకుని విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.