అప్రమత్తంగా ఉండండి..అధికారులకు కేసీఆర్ ఆదేశాలు!

వాస్తవం ప్రతినిధి:  హైదరాబాద్ మహానగరాన్ని వానలు వదలడం లేదు. గత మంగళవాన్ని కాళరాత్రిగా మిగిల్చిన వానలు అప్పటి నుంచీ రోజూ క్రమం తప్పకుండా కురుస్తూనే ఉన్నాయి. నగరంలోని పలు కాలనీలు ముంపునుంచి ఇంకా బయటపడలేదు. ఈ ఉదయం కూడా నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. వరద నుంచి కాస్త, కాస్తగా తేరుకుంటున్న కాలనీల్లోకి మళ్లీ నీళ్లొచ్చాయి. ఇప్పటికే వరదలో ఉన్న కాలనీలు మరింత మునిగాయి. చాలాచోట్ల ఇళ్లలో కూడా వెూకాలి లోతులో నీళ్లు నిలిచాయి. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, అవిూర్‌పేట, ఉప్పల్‌, రామంతాపూర్‌, చార్మినార్‌, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, చందానగర్‌, అల్వాల్‌, ఫీర్జాదిగూడ, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌, జవహర్‌నగర్‌, సఫిల్‌గూడ, కంచన్‌బాగ్‌, శంషాబాద్‌, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధుల భయం వెంటాడుతోంది.

భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు భారీగా వరద నీరు చేరి చెరువులన్నీ నిండాయి. ఈ నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.