కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర నిర్ధారించిన చైనా.. ఎంతంటే..??

వాస్తవం ప్రతినిధి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసి కోరల నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ లోకానికి కరోనాను అంటగట్టిన చైనాయే దాని విరుగుడికి మందు కనిపెట్టినట్లు ప్రకటించుకుంది. అంతేకాదు దాన్ని వినియోగించేందుకు ధరను కూడా నిర్ధారించారు.

చైనా దేశంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్న సమూహాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 60 డాలర్లకు(రెండు మోతాదులు) జాతీయ కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ను రెండు మోతాదులకు కలిపి 60 డాలర్లు అంటే దాదాపు రూ.4,400 గా నిర్ధారించారు. ఈ విషయాన్ని జియాక్సింగ్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనావాక్ అని పిలిచే ఈటీకాను రెండు మోతాదులు ఇస్తున్నట్లు తెలిపింది. ఒక్కో డోస్‌కు 200 యువాన్లు (29.75డాలర్లు) ఖర్చవుతుందని వెల్లడించింది. వైద్య నిపుణులతో సహా కొవిడ్‌ ముప్పు ఎక్కువున్నవారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది.