అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంథోనీ ఫౌచీపై మండిపడ్డ ట్రంప్ ..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సమయంలో ఎలా మాట్లాడతారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఊహించడం కష్టం. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కరోనా వైరస్‌ ఎక్స్‌పర్ట్‌ ఆంథోనీ ఫౌసీ మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆయన ఓ పెద్ద విపత్తు అని.. కోవిడ్‌ విషయంలో ఫౌసీ మాటలు విని ఉంటే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు చేరేదని తెలిపారు. అతడ్ని ఇడియట్‌గా అభిర్ణించారు. ఎన్నికల దృష్ట్యా ఫౌచీపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి ఫౌసీ, ట్రంప్‌తో విభేదిస్తూనే ఉన్నారు. ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అమెరికాలో 2 లక్షల పై చిలుకు మరణాలు సంబంవించినట్లు ఫౌసీ ఆరోపించారు. ఇది రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. దాంతో ట్రంప్‌ ఫౌసీ మీద గుర్రుగా ఉన్నారు.

నవంబర్ 3న అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ‘‘ఏమైనా జరగనీయండి.. ఇక మమల్ని వదిలేయండి’ అని ప్రజలు అంటున్నారు. వాళ్లు విసిగిపోయారు. ఫౌచీ సహా ఇతర ఇడియట్స్ మాటలను వినడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా ‘ఫౌచీ.. ఇంకా నువ్వు చెప్పే మాటలను మేము వింటే.. అమెరికాలో 7 నుంచి 8 లక్షల మరణాలు సంభవించడం ఖాయం. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటం వల్లే నీపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నాను’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.