ప్రముఖ ఎన్నారై వ్యవస్థాపక దంపతుల ఆధ్యర్యంలో .. ‘గెట్ అవుట్ ద ఓట్’ పేరిట భారీ ర్యాలీ..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికాలోని కాలిఫోర్నియాలో డెమొక్రటిక్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతుగా భారతీయ అమెరికన్లు ఆదివారం ‘గెట్ అవుట్ ద ఓట్'(జీఓటీవీ) పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యవస్థాపక దంపతులు అజయ్, వినీత భూటోరియా ఆధ్యర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వ్యాపార యజమానులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వ్యవస్థాపకులు, ఎన్నికైన అధికారులు, సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ అమెరికన్ ప్రముఖులు మాట్లాడారు.

తరువాతి తరం ఇండియన్ అమెరికన్ల అమెరికన్ డ్రీమ్ నెరవేరాలంటే తప్పకుండా బైడెన్, కమలాకు ఓటు వేయాలని ప్రముఖ హోటళ్ల అధినేత అశోక్ భట్ అన్నారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే చరిత్ర అవుతుందన్నారు. ఒక భారత సంతతి మహిళ దేశ రెండో అత్యున్నత పదవిలో కొనసాగడం అది మన అందరికీ ఎంతో గర్వకారణం అని భట్ తెలిపారు.

భూటోరియా మాట్లాడుతూ… “ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకం. ప్రస్తుతం దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సరియైన అభ్యర్థికి అధికారాన్ని ఇవ్వడం ఎంతో అవసరం. అది జరగాలంటే మన ఓటు సరియైన వ్యక్తికి వేసి గెలిపించుకోవాలి” అని అన్నారు. అందుకే మనం అందరం బైడెన్, కమలాకు ఓటు వేయాలి. ప్రధానంగా హోరాహోరీ పోరు ఉంటే రాష్ట్రాల్లో తప్పకుండా భారతీయ అమెరికన్లు బైడెన్, కమలాకే ఓట్లు వేయాలని భూటోరియా కోరారు.