కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం: వార్నర్

వాస్తవం ప్రతినిధి: గెలుపుదాకా వచ్చి.. అక్కడే ఆగిపోతున్నాం, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం ..అంటూ.. నిన్న రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ లో ఓటమి పై హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అసంతృప్తిని వ్యక్తపరిచారు. అబుదాబిలో నిన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ లో సన్‌ రైజర్స్‌ ఓడిపోయింది. సూపర్‌ ఓవర్‌ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. సులువైన లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను రషీద్‌ఖాన్‌ కాస్త ఇబ్బందిపెట్టారు. కానీ ఓటమిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ 3 విజయాలు, 6 ఓటములతో ఉంది. మ్యాచ్‌ ఓడినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న వార్నర్‌ సేన పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలోనే కొనసాగుతోంది.

ఈ ఓటమిపై కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందిస్తూ.. మొదట మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినప్పటికీ ముగింపులో మాత్రం తమ జట్టు విఫలమవుతోందని చెప్పారు. ‘ ఏం మాట్లాడాలో.. ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. గత మూడు మ్యాచుల్లో గెలుపు అంచులదాకా వచ్చాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్‌ ముగింపులో మేం విఫలమవుతున్నామనే విషయం స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ను ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నాను. దుబారుతో పోలిస్తే అబుదాబి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైంది కానీ ఇన్నింగ్స్‌ మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. నిజానికి 165-170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించదగిందే.. కానీ ఛేదనలో మా జట్టు కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్‌ గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. అతడిని ఫిజియో పరిశీలిస్తున్నారు. తరువాతి మ్యాచ్‌లకు కేన్‌ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం ‘ అని డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నారు.