కేంద్రం కుట్రలను సాగనివ్వబోము: సోనియా గాంధీ

వాస్తవం ప్రతినిధి: 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు. పార్టీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జ్ లతో ఓ సమావేశాన్ని నిర్వహించిన ఆమె, హరిత విప్లవంతో సాధించిన ఫలితాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని మోదీ సర్కారుపై మండిపడ్డారు.

దళితులపై అరాచకాలు పెచ్చు మీరాయని, బాధితుల గొంతులను నొక్కేయడమే కొత్త రాజధర్మంగా మారిందని విమర్శల వర్షం కురిపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంటే, బాధ్యతగల ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియాలో యువతకు ఉద్యోగాలు లేవని, దాదాపు 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని, చిన్న, మధ్య తరహా కంపెనీలు కుదేలయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు కనీస చర్యలను కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.

భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని ఆమె ఆందొళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని అన్నారు. ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణలు కోట్లాది మంది రైతులు, కౌలుదారులు, కూలీల జీవితాల్లో మరణ శాసనాల వంటివేనని అన్నారు. ఈ పరిస్థితుల్లో కుట్రలను ఛేదించేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాల్సి వుందని అన్నారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించిన ఆమె, కరోనా విజృంభణకు ప్రభుత్వ అసమర్థతే కారణమని అన్నారు.