బీజేపీ మహిళా అభ్యర్థిపై కమల్ నాథ్ దారుణ వ్యాఖ్యలు..మండిపడుతున్న బీజేపీ శ్రేణులు!

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా దబ్రా అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది. అధికార బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.

మొన్నటి వరకు మధ్యప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ సీఎం సీనియర్ నేత కమల్నాథ్ తాజాగా ఓ ఓ బీజేపీ మహిళా అభ్యర్థిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. కమల్ నాథ్ తాజా ప్రసంగంలో ఆ బీజేపీ మహిళా నాయకురాలిని ‘ఐటమ్’ అంటూ తప్పుగా పిలిచారు. ‘దాబ్రా’ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన అభ్యర్థి నిరాడంబరమైన వ్యక్తి అని.. ప్రత్యర్థిగా పోటీచేస్తున్న ఆమెతో పోల్చితే తక్కువ చేసినట్లు అవుతుంది. ఇంతకీ ఆమె ఏం ఐటమ్ అబ్బా.. ఏం ఐటమ్’ అంటూ నోరుజారారు.మధ్యప్రదేశ్ కేబినెట్లోని మంత్రి ఇమ్రాతి దేవిపై ఈ అవమానకర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ నేతలు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దళిత అభ్యర్థిపై అవమానకర మాటలు మాట్లాడిన కమల్ నాథ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఇటీవలే ఇమ్రాతి దేవి కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరి ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. ఈక్రమంలోనే కమల్ నాథ్ ఇలా నోరుపారేసుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమల్ నాథ్ పై బీజేపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు.