తెలంగాణ కు మళ్లీ వాన గండం … మరో మూడ్రోజులు భారీ వర్షాలే!

వాస్తవం ప్రతినిధి: రాజధాని నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాన తగ్గి ఐదు రోజులైనా నీరు అలానే ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

మరొవైపు తెలంగాణను వాన గండం భయపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా మారనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడే అవకాశముందన్నారు.

మొన్న కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నగర వాసులకు..వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించనున్నాడు. దీంతో మరోసారి నగర ప్రజలు వణికిపోయారు. పలు కాలనీలు ఇమనూ జలదిగ్భాంధంలోనే ఉన్నాయి. వరద ప్రవాహనికి వాహనాలు కొట్టుకుపోయాయి. చెరువులు నిండి సమీప ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. శనివారం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. వరద ప్రాంతాల్లో వాహన దారులు నీళ్లలో నుంచి ఎవరు వెళ్లకూడదని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వరద నీటిలో వహనాలు వస్తే సీజ్ చేస్తామని అన్నారు.