ట్రంప్‌కు మరోసారి బాధ్యతలు దక్కితే… దేశ భవిష్యత్తు అంధకారమే : కమలా హ్యారిస్

వాస్తవం ప్రతినిధి : డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విస్కాన్సిన్ రాష్ట్ర వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడిన కమలా హ్యారిస్.. ట్రంప్ పేలవమైన పరిపాలన విధానాల వల్ల ఇవాళ అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు.

కరోనావైరస్ ప్రభావం అమెరికాలో ప్రారంభం అవ్వడానికి ముందే దాని తీవ్రత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలుసునని, కానీ తేలికగా తీసుకోవడంతో అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. దీని ఫలితంగా రెండు లక్షలకు పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నడూ లేని విధంగా ఆర్థిక, నిరుద్యోగ సమస్యలు తలెత్తాయని, వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ విఫల అధ్యక్షుడికి మరోసారి బాధ్యతలు దక్కితే దేశ భవిష్యత్తు అంధకారమే అనడంలో ఎలాంటి సందేహం లేదని కమలా చెప్పుకొచ్చారు.