రాహుల్ గాంధీ పదేపదే హెచ్చరించినా వినలేదు: మోదీ పై మండిపడ్డ శశిథరూర్

వాస్తవం ప్రతినిధి: కరోనాను కట్టడి చేసే విషయంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ‘లాహోర్ లిటరేచర్ ఫెస్ట్’ వేదికగా థరూర్ భారత ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మహమ్మారి విషయంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు హెచ్చరించిందని, కరోనా కట్టడికి సంబంధించి సూచనలు చేసిందని… అయితే అన్నింటినీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. కరోనా విషయంలో కేంద్ర సరిగా వ్యవహరించలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. కరోనాను సీరియస్ గా తీసుకోకపోతే… దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని రాహుల్ గాంధీ పదేపదే చెప్పారని… అయినా కేంద్రం వినలేదని విమర్శించారు.

కరోనాను ఉపయోగించుకుని ముస్లిం వర్గంపై బీజేపీ మూర్ఖంగా ప్రవర్తిస్తోందని… తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వివక్షను చూపుతోందని థరూర్ ఆరోపించారు. ఇలాంటి వివక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశ పరువును తీసే విధంగా థరూర్ వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.