చరిత్ర సృష్టించిన జెసిండా ఆర్డెర్న్.. రెండోసారి న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఘన విజయం..!

వాస్తవం ప్రతినిధి : న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిర్వహించడంలో ఆమె చూపిన చొరవకు ఈ ఘన విజయం తార్కాణంగా నిలిచింది. శనివారం జరిగిన పోలింగ్‌లో 1.9 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం కొనసాగిన కౌంటింగ్‌లో 50 శాతం బంపర్‌ మెజార్టీ సాధించి జెసిండా చరిత్ర సృష్టించారు.

ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మొదలుపెట్టిన 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా 83.7శాతం ఓట్లు పోలవగా.. 49శాతం ఓట్లను దక్కించుకుని ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ప్రతిపక్ష నేషనల్ పార్టీ కేవలం 27శాతం ఓట్లను మాత్రమే పొంది ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జసిండా అర్డెర్న్.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించినందకు ప్రజలకు కృతజ్జతలు తెలిపారు. తదుపరి మూడు సంవత్సరాల్లో చేయాల్సిన పని చాలా ఉందని పేర్కొన్నారు.