ఎక్కడ ముఖ్యమంత్రి? అంటున్న లోకేష్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో వర్షాలు కుండపోతగా పడటంతో చాలా వరకు పంట నష్టం జరిగింది. భారీ వర్షం కారణంగా పంట పొలాల నీట మునిగిపోయాయి. దీంతో ముంపు ప్రాంతాలు అయిన మంగళగిరి, తెనాలి, వేమూరు ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నీటిలో మునిగిపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని… పాదయాత్రలో తమది రైతు రాజ్యం అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వరదలు వస్తే కనీసం సహాయ చర్యలు కూడా లేవని ప్రభుత్వంపై మండిపడ్డారు. వరదల కారణంగా కనీసం సమీక్ష సమావేశాలు కూడా ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారా అంటూ లోకేష్ సీరియస్ అయ్యారు. అదేవిధంగా అసెంబ్లీలో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు… ఇక్కడకు వచ్చి వాస్తవాలు చూడాలని హితవు పలికారు. ప్రతి విషయంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయిందని.. రైతులను కన్నీరు పెట్టిస్తుంది అంటూ లోకేష్ మండిపడ్డారు.