ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో

వాస్తవం ప్రతినిధి: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో పాసింజర్ లకు భారీ ఆఫర్లు ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఐదు నెలల పాటు మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత సర్వీసులు పునరుద్ధరించిన కరోనా భయంతో చాలావరకు పాసింజర్లు మెట్రో జర్నీకి భయపడుతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోపక్క కుండపోత వర్షాలు కారణంగా మొన్నటి వరకు మెట్రో సర్వీసులు ఆగిపోయాయి. అక్టోబర్ 17 నుండి మళ్లీ పునరుద్ధరించడంతో ఈసారి ప్రయాణికులను ఆకర్షించడం కోసం చార్జీల రాయితీలు కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు ప్రకటించారు. స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వ‌ర‌కు ప్ర‌త్యేక రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ట్రిప్ కార్డుల‌పై రాయితీ అక్టోబర్ 17 నుంచి సంక్రాంతి వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్న‌వారికి 2 నెల‌ల వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే… 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే.. 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరగవచ్చునని అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ 17 నుంచి ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని మెట్రో అధికారులు వెల్లడించారు.