దేశప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు : మోదీ

వాస్తవం ప్రతినిధి:  ఈ రోజు నుండి దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పండగరోజులు ప్రజలకు శాంతి, సంపదలను తీసుకురావాలని కోరుకున్నారు.

‘నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి మాతకు ప్రణామాలు. ఆమె ఆశీస్సులతో ఈ భూగ్రహం సురక్షితంగా, ఆరోగ్యంగా, సంపదలతో అలరారుతుందని ఆశిద్దాం. ఆమె ఆశీర్వాదం పేద, అణగారిన ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మాకు బలాన్ని ఇస్తుంది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో జగదాంబా అమ్మవారిని స్మరించుకున్నారు.

కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య నిపుణులు, అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.