మోదీకి నేను హనుమంతుడిని.. అవసరమైతే ఛాతిని చీల్చి చూపిస్తా!: చిరాగ్ పాశ్వాన్

వాస్తవం ప్రతినిధి:బీహార్ ఎన్నికల ముందు లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బీహార్ లో ఈనెలాఖరులో జరగనున్న మొదటి విడత ఎన్నికలకు ముందు ఎల్జేపీతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టంగా ప్రకటించింది. ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ తమకు ప్రధాన ప్రత్యర్ధి నితీష్ కుమార్ మాత్రమే అంటూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకవైపు ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ ఒకవైపు నితీష్ పై యుద్ధం ప్రకటిస్తునే మరోవైపు బీజేపీతో మిత్రత్వం ఉందని ప్రకటించటం విచిత్రంగా ఉంది.

ఈ నేపధ్యంలో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను వీరాభిమానినన్నారు. ఎల్జేపీకి వ్యతిరేకంగా మాట్లాడేలా సీఎం నితీశ్‌కుమారే భాజపా నేతలు, మోదీపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తాను మాత్రం ప్రధాని మోదీకి విధేయుడిగానే ఉంటానని చిరాగ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మోదీ ఫొటోలను వాడాల్సిన అవసరం తనకు లేదని, ఆయన తన హృదయంలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. మోదీకి తాను హనుమంతుడినని పేర్కొన్న చిరాగ్‌.. అవసరమైతే తన ఛాతిని చీల్చి చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.