ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి ని శాలువాతో సత్కరించిన పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి:  ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే.పవన్ మద్రాసులో కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే సమయంలో ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మారింది.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి ఆనందసాయి ఆర్కిటెక్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం రావడంతో ఆనందసాయి ఎంతో నిష్టగా వ్యవహరించి, ఆలయ నిర్మాణం, ఇతర వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేశారు. అంతేకాదు, ఆకట్టుకునేలా ఆలయ డిజైన్లు ఇచ్చారు.

ఈ క్రమంలో ఆయనను శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ‘ధార్మిక రత్న’ బిరుదుతో గౌరవించింది. హైదరాబాదు బిర్లా ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా పురస్కారం అందించారు.

ఈ క్రమంలో ఆనందసాయిని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హైదరాబాదులోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించారు. ఆలయ నిర్మాణంలో ఎంతో నిబద్ధతతో పాల్గొనడం ప్రశంసనీయం అంటూ పవన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నటుడు నర్రా శ్రీను కూడా పాల్గొన్నారు.

ఆనందసాయి వివాహంలోనూ పవన్ కీలకపాత్ర పోషించారని చెబుతారు. ‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్ చెల్లెలుగా కనిపించిన తమిళ నటి వాసుకినే ఆనందసాయి పెళ్లాడారు.