సీఎం కేసీఆర్ పరిపాలనని ఎండగట్టిన విజయశాంతి..!!

వాస్తవం ప్రతినిధి: టీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. వర్షాల నేపథ్యంలో సరైన సహాయ కార్యక్రమాలు, చర్యలు ప్రభుత్వం ఎలాంటివి చేపట్టకపోవటం పై కేసిఆర్ పరిపాలనని ట్విటర్ లో విజయశాంతి ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. ” వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం… కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. టీఆరెస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు… అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారు. కానీ, జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు. మొత్తంగా చూస్తే పాలకవర్గం తప్ప మరే వర్గమూ ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయి. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆరెస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉపఎన్నిక పైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిది.” అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించింది.