మెగా బ్రదర్ నాగబాబు ని పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి..!!

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో అలరించడమే కాకుండా సామాజికంగా కూడా ప్రజలకు మంచి చేయడంలో ముందుంటారు అని అందరికీ తెలుసు. ఆ ఆలోచన ఉండబట్టే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మంది జీవితాల్లో చిరంజీవి వెలుగులు నింపి పద్మభూషణ్ అవార్డు అందుకోవటం జరిగింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో చిరంజీవి.. నేరుగా స్పందించి కరోనా నుండి కోలుకున్న వారు ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయాలని అప్పట్లో పిలుపునివ్వడం తెలిసిందే. అయితే చిరంజీవి పిలుపుమేరకు మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కరోనా బారినపడి కోలుకోవడంతో తొలిసారి ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు ని అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. . ‘‘కొవిడ్-19తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కొవిడ్ నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోపక్క మెగా అభిమానులు కూడా అన్న కి తగ్గ తమ్ముడు అంటూ నాగబాబు ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.