ప్రధాని మొడీ చరాస్తులు విలువ ప్రకటించిన ప్రధాని కార్యాలయం !

వాస్తవం ప్రతినిధి: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ప్రధాని మోదీ చరాస్తులు గత 15 నెలల కాలంలో రూ. 36.53 లక్షలు పెరిగాయి. ఆయన చరాస్తుల విలువ రూ. 1,39,10,260 నుంచి రూ. 1,75,63,618కి పెరిగింది. ఒక మధ్య తరగతి వ్యక్తి మాదిరే ఆయన తన జీతంలో అధిక భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు చేశారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, స్థలం ఉన్నాయి. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ప్రతి నెలా జీతాన్ని ఫిక్సుడు చేయడం వల్ల మోదీ చరాస్తులు పెరిగాయి. స్థిరాస్తుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. గాంధీనగర్ లో ఉన్న ఇల్లు, స్థలం విలువ రూ. 1.1 కోట్లు. ఆయనకు జీవిత బీమా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో కూడా పొదుపు చేశారు. జూన్ 30 నాటికి ఆయన పొదుపు ఖాతాలో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 ఉన్నాయి.
మరోవైపు, మోడీ తర్వాత కేంద్రప్రభుత్వంలో నెం.2గా ఉన్న హోం మంత్రి అమిత్ షా ఆస్తి 2019లో రూ.32.3 కోట్లు ఉండగా, ఈ ఏడాది జూన్ నాటికి రూ.28.63కోట్లకు తగ్గినట్టుగా డిక్లరేషన్ లో పేర్కొన్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా సీనియర్ మంత్రులందరూ తమ సంపదలను వెల్లడించారు. రామ్‌దాస్ అథవాలే, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి సహా కొందరు జూనియర్ మంత్రులు తమ డిక్లరేషన్లను ఇంకా దాఖలు చేయలేదు.