రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసిన మోడీ..!!

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బాగా కురియడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెలంగాణలో కూడా ఎడతెరపి లెకుండా వర్షం పడటంతో అక్కడ కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అయితే చాలావరకు జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల హైదరాబాదులో కరెంటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాలలో వర్షాలపై పరిస్థితి ఆరా తీస్తూ కేసిఆర్, జగన్ లకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఏపీలో వరదలతో నెలకొన్న పరిస్థితి గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ వివరించారు. వాయుగుండం తీరం దాటడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు గురించి కూడా మోడీకి వివరించారు. ఇదే రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా మోడీ ఫోన్ చేయడం జరిగింది. కేసిఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి వివరించారట. ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి మోడీ ఆరా తీయడంతో…అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ గా ఉందని మోడీ కి ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.