రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబు లెటర్లు అంటున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు గత కొన్ని రోజుల నుండి పలుమార్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కి లెటర్లు రాస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదని, శాంతిభద్రతలు అదుపులో లేవని అంటూ పలు ఘటనలపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి లెటర్లు రాయడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లెటర్ లో కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు రాసిన లెటర్ల గురించి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు రాస్తున్న లెటర్ల లో ఉన్న ఆరోపణలు విచారణ చేస్తే అవన్నీ అవాస్తవాలే అని తేలుతున్నట్లు చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నట్టుగా చంద్రబాబు లెటర్లు రాస్తున్నారని, కానీ ఏపీలో శాంతిభద్రతలు అంతా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. మీ పొలిటికల్ మైలేజ్ కోసం పోలీస్ వ్యవస్థను వివాదాల్లోకి లాగవద్దని గౌతమ్ సవాంగ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సైబర్ నేరాల అరికట్టే విషయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ప్రకాశం జిల్లా పోలీసుల పనితనం చాలా చక్కగా ఉందని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ వాడటంలో ప్రకాశం జిల్లా పోలీసులు ముందున్నారని, మిగతా జిల్లా పోలీసులు కూడా అదే విధంగా రాణించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు.