అసెంబ్లీ ముందు ఓ ఇల్లాలు ఆత్మహత్య కలకలం !    

వాస్తవం ప్రతినిధి:   అత్తింటోళ్లు వేధిస్తున్నారని ఓ ఇల్లాలు ముఖ్యమంత్రికి తన సమస్యను చెబుదామని వచ్చి అసెంబ్లీ ఎదుట ఒంటికి నిప్పు అంటించుకుంది. కలకలం రేపుతున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలప్రకారం..

35 ఏళ్ల అంజన అనే మహిళకు గతంలో అఖిలేశ్‌ తివారి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం ఆసిఫ్‌ అనే యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఆసిఫ్‌ను రెండో పెళ్లి  చేసుకునేందుకు అంజన ఇస్లాం మతం స్వీకరించింది. ఈ క్రమంలో అంజన తన పేరును ఆయిషాగా మార్చుకుంది. కొన్నాళ్ల తర్వాత ఆసిఫ్‌ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు. అంజనా మాత్రం అత్తింట్లోనే ఉండిపోయింది.

భర్త సౌదీ వెళ్లగానే అత్తింటివారు తనను తీవ్రంగా వేధిస్తున్నారని అంజన పోలీసులను ఆశ్రయించింది. మహారాజ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలమైంది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన బాధితురాలు మంగళవారం లక్నోలోని అసెంబ్లీ గేటు ఎదుటకు వెళ్లింది. తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు మంటలను ఆర్పి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.