అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డిజిటల్ గ్రాఫిక్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన ఎన్నారై జంట..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇదిలాఉంటే… మొదటి నుంచి బైడెన్‌కు మద్దతుగా వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిలికాన్ వ్యాలీకి చెందిన భారతీయ దంపతులు అజయ్, వినీత భుటోరియాలు తాజాగా డిజిటల్ గ్రాఫిక్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. అధ్యక్ష అభ్యర్థి బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా హిందీతో పాటు సుమారు 14 భారతీయ భాషల్లో సోమవారం ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌కు ‘ట్రంప్ హఠావో.. అమెరికా బచావో’, ‘బైడెన్ హారిస్ కో జీతావో, అమెరికా కో ఆగే బడావో’ పేర్లు పెట్టారు. అమెరికాలో హోరాహోరీ పోరు ఉండే రాష్ట్రాలపై ఈ క్యాంపెయిన్ ప్రధానంగా ఫోకస్ పెడుతుందని ఈ సందర్భంగా భూటోరియా దంపతులు వెల్లడించారు. సుమారు 1.3 మిలియన్ల ఇండో-అమెరికన్ల ఓట్లు బైడెన్‌కే పడాలనే ఉద్దేశంతో ఆయనకు మద్దతుగా అమెరికాలోని భారతీయులకు చేరువయ్యేలా భారతీయ భాషల్లోనే పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.