వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీమ్ నోటీసులు

వాస్తవం  ప్రతినిధి:  కేంద్రం పెట్టిన వ్యవసాయ చట్టాలపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020) బిల్లులను సెప్టెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. వీటిని రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే పార్లమెంట్ లో ఈ బిల్లులను ఆమోదించిన తరువాత నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
కొన్ని రాష్ట్రాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీం కోర్ట్ లో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. కాగా ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టారు. సుప్రీం కోర్టు న్యాయవాది మనోహర్‌శర్మ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఛత్తీస్‌గఢ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేసారు. ఈ చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని వీటిని అమలు కాకుండా చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ కి వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే న్యాయవాది శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించింది. పిటిషన్ లో సరైన కారణాలను పేర్కొనలేనందున తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్ ను ఉపసంహరించుకోవాల్సిందిగా న్యాయవాదికి సూచన చేసింది.
అనంతరం ఇరు వర్గాల వాదనను సుప్రీమ్ కోర్ట్ విచారించి నాలుగు వారాల లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు పంపింది.