బ్యాటింగ్ వైఫల్యంతో బౌలర్ల కష్టానికి ఫలితం లేకుండా పోయింది: ధోనీ   

   వాస్తవం ప్రతినిధి:   మిడిల్ ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అదే తమ పతనాన్ని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. కోల్‌కతా‌ నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగులతో ఓడిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో రాణించి ప్రత్యర్థిని సాధారణ స్కోర్‌కే పరిమితం చేసిన ధోనీసేన.. బ్యాటింగ్‌లో షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ చేసినా చివర్లో ధాటిగా ఆడలేక ఓటమికి తలవొంచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. బ్యాటింగ్ వైఫల్యంతో బౌలర్ల కష్టానికి ఫలితం లేకుండా పోయిందన్నాడు. తాము మరింత విన్నూతంగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) మినహా అంతా విఫలమయ్యారు. బర్త్‌డే బాయ్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ రెండేసి వికెట్లు తీసారు. అనంతరం చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. షేన్ వాట్సన్ (40బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 50), అంబటి రాయుడు(27 బంతుల్లో 3 ఫోర్లతో 30) రాణించినా ఫలితం లేకపోయింది. ధోనీ(12 బంతుల్లో 11) కూడా నిరాశ పరిచాడు. చివర్లో 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన క్రమంలో జడేజా(21 నాటౌట్), జాదవ్(7 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయారు.