మాజీ గవర్నర్ ఆత్మహత్య !  

 వాస్తవం ప్రతినిధి:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ అలాగే మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్ గా‌ పనిచేసిన అశ్వనీ కుమార్‌   (69) ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి ఆయన సిమ్లాలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సిమ్లా పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ చావ్లా ధృవీకరించారు
దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్నో కీలక పదవుల్లో పని చేసిన ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.  తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేపట్టారు. దీనికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా అశ్వనీ కుమార్ తొలిసారి బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత పలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనూ కీలక పాత్రను పోషించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భద్రతా విభాగంలో ఉన్నారు. 2006 నుంచి 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పని చేశారు. 2008 ఆగస్టు 2 నుంచి 2010 నవంబర్ 30 వరకు సీబీఐ డైరెక్టర్‌గా సేవలు అందించారు. 2013 మార్చి 21న నాగాలాండ్‌కు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా పలు కీలక పదవులు నిర్వహించారు.