ఐపీఎల్ లో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న రాహుల్ తెవాటియా

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్ లో మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరూ విసుగు చెందేలా చేసిన ఎడమచేతివాటం తెవాటియా ఆపై ఒక్కసారిగా వేగం పెంచి విధ్వంసం సృష్టించాడు.

ఆ ఇన్నింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం ఆకట్టుకుంది. అందుకే కోహ్లీ తన జెర్సీని తెవాటియాకు కానుకగా ఇచ్చాడు. ఆ జెర్సీపై డియర్ రాహుల్… బెస్ట్ విషెస్ అని రాసి బహూకరించాడు. నిన్న సాయంత్రం బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ… తెవాటియాకు అభిమానిగా మారిపోయాడు. తన జెర్సీని ఇచ్చి అతడిని మరింత ప్రోత్సహించాడు.