ఈ ఘటన ఒకవిధంగా ప్రజాస్వామ్యంపై గ్యాంగ్‌రేప్ లాంటిదే: శివసేన

వాస్తవం ప్రతినిధి: రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నేత. కాంగ్రెస్ పార్టీతో తమకు కొన్ని విభేదాలు ఉండొచ్చు. అయినప్పటికీ ఆయనతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఎవ్వరూ సమర్థించరు అంటూ శివసేన మండిపడింది. రాహుల్ చొక్కా పట్టుకొని తోసివేయడం ఒకవిధంగా భారతదేశ ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారమే అంటూ శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.

హాథ్రస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం యుపి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం గ్రేటర్‌ నోయిడావద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్‌ కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని శివసేన తీవ్రంగా ఖండించింది.. పోలీసులు రాహుల్ గాంధీ గళ్లా పట్టుకుని కిందికి తోసేశారని , ఇది ఒకవిధంగా ప్రజాస్వామ్యంపై గ్యాంగ్‌రేప్ లాంటిదేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.