వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో ఓ యువతిని నాలుక కోసి అత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు . మానవ మృగాల చేతిలో హత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బాలిక మృతిచెందడం పట్ల విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అధికార యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల తీవ్రంగా విఫలమైందని విమర్శిస్తున్నాయి. మరోవైపు తాజాగా ఘటనపై యూపీ కాంగ్రెస్ విభాగం ప్రధాన నగరాల్లో నిరసన చేపట్టింది..
ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలు గురువారం హత్రాస్‌కు బయలుదేరారు. అయితే, వారి కాన్వాయ్‌ను యూపీ పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ హైవే దగ్గర అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే నడక ప్రారంభించారు.
దీంతో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. కేవలం ఆరెస్సెస్, భాజపా నేతలు మాత్రమే రోడ్డుపై నడవాలా? అని నిలదీశారు. తొలుత రాహుల్ హాథ్రస్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు సెక్షన్ 188 కింద అరెస్టు చేస్తున్నట్టు రాహుల్‌కు చెప్పారు. ఎపిడమిక్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అడ్డుకున్నట్టు నోయిడా ఏసీపీ తెలిపారు. ఆయన్ను ముందుకు వెళ్లనీయబోమన్నారు.
అందుకు స్పందించిన రాహుల్.. తానొక్కడినే నడిచి వెళ్తానని, అడ్డుకోవద్దని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.