రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం

వాస్తవం ప్రతినిధి: సోమవారం రాత్రి చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది.

ఈ ఉత్కంఠ విజయంతో బెంగళూరు అభిమానులు ఆనందంలో తెలియాడుతున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శ‌ర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో అనుష్క ఓ పోస్టు చేశారు. ‘ఓ గ‌ర్భిణి.. మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంతక‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంది’ అని అనుష్క పేర్కొన్నారు. గ‌ర్భిణి అయిన త‌న‌కు గత రాత్రి ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అమితానందాన్ని ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఇన్‌స్టా స్టోరీలో విక్ట‌రీ మూమెంట్ ఫోటోలతో పాటు బెంగుళూరు స‌భ్యుల ఫోటోల‌ను కూడా ఆమె పోస్టు చేశారు.