చంద్రబాబును ఏ క్షణంలో అయినా అరెస్ట్ చెయ్యొచ్చు:: తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కోర్టు తీర్పులు భరించలేక ఏదో ఒక రోజు ప్రజలు ఉద్యమిస్తే తెలుస్తుందని, సీ ఎం జగన్ మౌనం వీడితే ప్రళయం వస్తుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

30 లక్షల మంది ప్రజలకు ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా కోర్టులు అడ్డుకుంటుంటే… జనాలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఎందుకో మౌనంగా ఉంటున్నారని, మౌనం వీడాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారో చెప్పలేమని తమ్మినేని అన్నారు.

వెధవ పనులన్నీ చేసి, సీబీఐ విచారణ అంటున్నారని విమర్శించారు. 26 కేసులలో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని… దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షానికి కళ్లు, చెవులు లేవని అన్నారు. పేదలకు సంక్షేమం అందకపోతే ప్రతిపక్షం పోరాడాలని… కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకోవడం మంచిది కాదని చెప్పారు.