ఢిల్లీ పర్యటనకు సీ ఎం జగన్!

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రేపు సాయంత్రం కలవనున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు కూడా జగన్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ పన్నుల వాటాను విడుదల చేయాలని మంత్రులను జగన్ కోరనున్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అంశాలు, పార్లమెంటులో జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. మరోవైపు, జగన్ ఇంత హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.