జ‌గ‌న్‌ నిర్ణ‌యం పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: విద్యుత్ మీట‌ర్ల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు.

సిద్దిపేట జిల్లా పద్మనాభునిపల్లిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్రసంగించిన ఆయన జగన్ నిర్ణయం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

రూ. 4 వేల కోట్ల కోసం ఆశ‌ప‌డి ఏపీలో బావులు, బోర్ల‌కు విద్యుత్‌ మీటర్లు పెట్టార‌ని హ‌రీష్‌రావు కామెంట్ చేశారు. హ‌రీష్‌రావు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్ప‌టికే సీఎం జ‌గన్ నిర్ణ‌యాల‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఫ్రెండ్లీగా ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే వినిపించ‌డం చ‌ర్చ‌నీయాశంగా మా‌రాయి.

వ్య‌వ‌సాయ విద్యుత్‌కు మీట‌ర్లు పెడితే తెలంగాణ‌కు కూడా రూ.2500 కోట్లు ఇస్తామ‌ని కేంద్రం ఆఫ‌ర్ చేసింద‌ని.. కానీ కేసీఆర్ దాన్ని మ‌రోమాట లేకుండా తిర‌స్క‌రించారంటూ చెప్పుకొచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి కేంద్రం రైతులను ముంచేందుకు చూస్తోందని హరీశ్‌ రావు ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే కేంద్రానికి మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ఏపీ, తెలంగాణ భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. తాజాగా వ్య‌వ‌సాయ బిల్లుల‌ను పార్లమెంట్‌లో టీఆర్ఎస్ వ్య‌తిరేకిస్తే.. వైసీపీ స‌మ‌ర్థించింది. ఏదేమైనా హ‌రీష్‌రావు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.