చంద్రబాబు కి ఊహించని పరిణామం..జగన్‌కు జై కొట్టిన మరో నేత!

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కొడుకులను వైకాపాలో చేర్పించి, జగన్‌కు జైకొట్టారు.
వాసుపల్లి ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోతన కొడుకులకు వైకాపా పార్టీ తీర్థం ఇప్పించారు. రాజధానిగా విశాఖ వస్తుందని కోరుకున్నానని, జగన్ విధానాలు తనకు నచ్చాయని గణేష్ చెప్పుకొచ్చారు.

టీడీపీ అనర్హత వేటు వేస్తే ఎదుర్కొంటానని, ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. జగన్ దమ్మున్న నాయకుడని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ చేరుతున్నాయని కొనియాడారు. ‘విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తీసుకొచ్చారు. నా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇదంతా జగన్ వల్లే సాధ్యమైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి ఆయనకు కనుకగా ఇస్తా’ అని అన్నారు.

గణేష్ కుటుంబం రాకతో తమ పార్టీ మరింత బలపడిందని వైకాపా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.