జగన్ పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికెత్తుతూ ఏపీ మంత్రి కోడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా వచ్చాక జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రకటన రాకముందే చంద్రబాబు బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, దీనిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో విచారణకు ఆదేశించారని తెలిపారు.కానీ కొందరు మాత్రం కొన్ని వ్యవస్థలను వాటిలోని లొసుగుల ఆధారంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. తమ మాటే వినాలని, తాము చెప్పిందే పాటించాలని, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలను తాము ఏమైనా చేయగలమని కొన్ని వ్యవస్థలు అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు.

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించకపోవడంతో సీఎం జగన్ స్వయంగా సిట్, సీఐడీ విచారణకు ఆదేశించాల్సి వచ్చిందని వివరించారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డంపడుతుండడమే కాకుండా పార్లమెంటులోనూ ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో వ్యవహరిస్తున్నారని కొనియాడుతూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు. ఎదుటివారు ఎంతటి వాళ్లయినా ఢీకొట్టే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని, అవతల కొండలు ఉన్నా సైతం పిండిని చేసే సత్తా జగన్ కు ఉంది అని, జగన్ వంటి నేత గతంలో లేడని, ఇకముందు వస్తాడో రాడో తెలియదు అంటూ కోడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.