జగన్ జైలుకు వెళ్లడం ,జమిలి ఎన్నికలు రావడం పక్కా అంటున్న అయ్యన్న

వాస్తవం ప్రతినిధి: విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి దూరం కావడంపై స్థానిక నేతలు, జిల్లా నేతలు, మాజీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఆదివారం నాడు విశాఖలో తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాసుపల్లి ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శలు గుప్పించారు
రాజకీయాల్లో విలువలు చచ్చిపోయాయని.. అసలు అధికారం పోతే బతకలేమా? అని వాసుపల్లిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పథకాలు కన్నా దోచుకున్నదే ఎక్కువ. మాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ విలువలే ముఖ్యమన్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు మేము ఇమడలేకపోతున్నాం. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారు. ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు. ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారు. సొంత పార్టీ వారికే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. వైసీపీలోకి వెళ్లిన వారందరూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు. యుద్దం అంటూ మొదలైతే వెనక్కి తిరిగే ప్రసక్తే వుండకూడదు. భయపడి పారిపోయే దోరణి మాకు లేదు. టీడీపీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ నుంచే వచ్చారు. తెలంగాణా కేబినెట్‌లో సగం మంది నాయకులు మన టీడీపీ నుంచి వెళ్లన వారే.

చంద్రబాబు చేసిన సేవలను గుర్తించి వాసుపల్లిని గెలిపిస్తే ఎమ్మేల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారు. రాబోయే కాలం మాది (టీడీపీది) పోయేకాలం వైసీపీది. ప్రధాని కాళ్లు మొక్కినా వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. జమిలి ఎన్నికలు రావడం ఖాయం. నెలాఖరుకల్లా జిల్లా కమిటీలను అధిష్టానం ప్రకటిస్తుంది. తప్పకుండా టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది’ అని అయ్యన్న చెప్పుకొచ్చారు.