ఐపీఎల్ 13వ సీజన్ నేడే ప్రారంభం!

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్ 13వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ ఆతిథ్యం యూఏఈకి దక్కిన క్రమంలో ఆరంభ మ్యాచ్ లో ఈ సాయంత్రం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ తో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 28 పర్యాయాలు తలపడ్డాయి. అయితే ముంబయి జట్టుదే పైచేయిగా ఉంది. ముంబయి 17 విజయాలు అందుకోగా, సూపర్ కింగ్స్ 11 విజయాలు సాధించింది. ఓవరాల్ గా రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ 4 సార్లు టైటిల్ నెగ్గగా, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. రెండు జట్లలోనూ ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండడంతో ఎప్పుడు తలపడినా హోరాహోరీ పోరు ఖాయం.