కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ రోడ్డెక్కిన సిటీ బస్సులు

వాస్తవం ప్రతినిధి: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సిటీ బస్సు సర్వీసులు విజయవాడలో ఈ రోజు నుండి రోడ్డెక్కాయ్. నగరంలోని ఆరు మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉదయం సర్వీసులు ప్రారంభించారు.
కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఒక సీటులో ఒక్కరికి మాత్రమే కూర్చునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ నెల 26 వరకు బస్సులు నడుపుతామని, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందని ఆర్ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు. బస్సుల్లో 60 శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రతీ స్టాప్ వద్ద ఆర్టీసీ ఉద్యోగి అందుబాటులో ఉంటాడని, శానిటైజ్ చేసిన తర్వాతే ప్రయాణికులను బస్సులోకి ఎక్కిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరని ఆర్ఎం పేర్కొన్నారు. రాయితీలను అనుమతించబోమని, అలాగే నిల్చుని ప్రయాణించడం కూడా నిషిద్ధమని తెలిపారు. ప్రస్తుతం మైలవరం, ఆగరిపల్లి, విస్సన్నపేట, పామర్రు, విద్యాధరపురం, మంగళగిరి ప్రాంతాలకు 100 బస్సులను తిప్పుతున్నట్టు నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.