తీవ్ర దుమారం రేపుతున్న బెంజ్ కారు వ్యవహారం

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మంత్రి గుమ్మనూరు జయరాం కొడుకు బెంజ్ కారు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయనకు సంబంధం ఉందని, అందుకే కారు కొనిచ్చారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆధారాలు బయటపెడితే తాను రాజీనామాకు కూడా సిద్ధమేనంటూ మంత్రి జయరాం ప్రకటించడంతో మరింత సమాచారం బయటపెట్టారు. మంత్రి కుమారుడు బెంజ్ కారు నడుపుతున్నవీడియోను మీడియాకు విడుదల చేశారు.

కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో అది ఎలా వచ్చిందో చెప్పాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ స్కాంతో సంబంధం ఉన్న తెలకపల్లి కార్తీక్‌ దీన్ని జయరాం కొడుక్కు ఇచ్చాడని పేర్కొన్నారు. ఆ కారు మంత్రి ఇంట్లోనే ఉందని ఆరోపించారు. వెంటనే సీఎం జగన్ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంలో తమ పార్టీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనవసరంగా ఇరికించారని మండిపడ్డారు.

కాగా కారు వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను మంత్రి జయరాం ఖండిస్తున్నారు. తన కొడుక్కు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారని, వారి కారుతో ఫొటో దిగినంత మాత్రాన అది తమది అయిపోతుందా అంటూ ప్రశ్నించారు. దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.