కేసీఆర్ గారూ మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో..!

వాస్తవం ప్రతినిధి: హైదరాబాదులోని దీనదయాళ్ నగర్ లో ఉన్న నాలాలో సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ…

‘కేసీఆర్ గారూ… మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి. సికింద్రాబాద్‌లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్‌నగర్‌ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని జీవితం కరిగిపోయింది. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు బలైపోయాయో లెక్క తీస్తే ఒక గిన్నిస్ రికార్డు అవుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం… ఇలా జరక్కుండా చూస్తామని హామీలిచ్చి వెళ్ళిపోవడం మామూలైపోయింది. వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాదులోని పలు ప్రాంతాలు నీట మునిగిపోవడం పాత ప్రభుత్వాల పుణ్యమేనని గతంలో మీరు ఎన్నోసార్లు విమర్శించారు. మరి గడిచిన ఆరేళ్ళ కాలంలో మీ ప్రభుత్వం చేసిందేంటి? ఇప్పుడు రాష్ట్రంలోని పలు ఇతర పట్టణాలు, నగరాలు హైదరాబాదు నగరానికి తోడవుతున్నాయి. అడుగడుగునా కబ్జాలు, అక్రమ కట్టడాలతో ఆ ప్రాంతాలు కూడా చినుకు పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజల ఆగ్రహ వెల్లువలో మీరూ కొట్టుకపోకముందే మేలుకుని పరిస్థితిని చక్కదిద్దండి’ అని రాములమ్మ హితవు పలికారు.