ట్రంప్ నన్ను లైంగికంగా వేధించాడు : మాజీ మోడల్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో ట్రంప్‌పై డోరిస్ వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు.

మోడల్ అమీ డోరిస్ మాట్లాడుతూ..”అతడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూశాడు. నేను అతనిని నెట్టివేశాను. ఆపై అతడి పట్టు గట్టిగా మారింది. అతడు తన చేతులతో నా శరీరంపై ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. నేను ఆయన పట్టులో ఉండిపోయి బయటపడలేకపోయాను” అని డోరిస్ ఒక పత్రికకు ఇచ్చని ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2016 లోనే ఈ విషయంపై ముందుకు రావాలని భావించినప్పటికీ, కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే తన టీనేజ్ కవలకుమార్తెలకు రోల్ మోడల్‌గా ఉండేందుకే ఈ వేధింపులపై ప్రపంచానికి తెలిజేయాలని తాజాగా నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు.

 

ఈ విషయంపై ట్రంప్ న్యాయవాదులు వార్తాపత్రికతో మాట్లాడుతూ.. మాజీ మోడల్ చేసిన ఆరోపణలు నమ్మదగినవి కావని, ఆమెపై దాడి జరిగితే సాక్షులు కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో చే్స్తున్న ఆరోపణల తప్ప మరొకటి కాదని కొట్టి పారేశారు.