H1B కేసులో ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఊరట..!!

వాస్తవం ప్రతినిధి: హెచ్‌1బీ వీసా నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ట్రంప్‌ జూన్‌ 22న ప్రకటించిన హెచ్‌1బీ వీసా ఆంక్షలను సవాల్‌ చేస్తూ 169 మంది ఎన్‌ఆర్‌ఐలు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని అక్కడి కోర్టు తిరస్కరించింది. హెచ్ 1 బీ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ లోని కోర్టు సమర్థించింది. దీంతో ప్రాథమికంగా ట్రంప్ సర్కార్ కి కోర్టులో ఊరట లభించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పాలసీ దేశానికి తీవ్ర హానికరమని బడా టెక్ కంపెనీలు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాయి. అలాగే అమెరికాలో వర్క్ వీసాలపై ఉద్యోగాలు చేస్తూ తిరిగి ఇండియాకు వఛ్చిన 169 మంది భారతీయులు కూడా ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీసా నిషేధాజ్ఞ ఏకపక్షమైనదని, నిలకడలేనిదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, వీసా ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్ధించారు.

కాగా, ఈ కేసును విచారించిన యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి అమిత్‌ మెహతా ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. తమ వాదనను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను భారతీయ ఉద్యోగులు అందించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. సా రద్దు నిర్ణయం నిలిపివేతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి మెహతా తిరస్కరించడం ఇది రెండోసారి. గత నెలలో కూడా ఆయన ఇదే విధమైన ఉత్తర్వులు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వ డిక్రీని సస్పెండ్ చేయాలన్న అభ్యర్థన నిలవజాలదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాము సుప్రీంకోర్టులో ఈ రూలింగ్ పై అప్పీలు దాఖలు చేస్తామని భారతీయ వర్కర్లు తెలిపారు.