భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష..!!

వాస్తవం ప్రతినిధి: భార్యను హత్య చేసిన కేసులో భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 23 ఏళ్ల జిగుకుమార్ సోర్తి అనే భారత సంతతి వ్యక్తి తన భార్య భవిని ప్రవీన్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సెస్టర్‌ నగరంలో నివసించిన భవిని ప్రవీన్‌ కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 2వ తేదీ 12:30 నిమిషాల సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన జిగుకుమార్‌ కొద్ది సేపు ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి, ఆ కత్తిని అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. అనంతరం వీధిలో కనిపించిన ఒక పోలీసు అధికారితో తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు భవినిని హాస్పటల్‌లో చేర్పించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్ట్‌మార్టంలో ఆమెను అనేక సార్లు పొడవడంతో గాయాలయ్యి మరణించినట్లు వెల్లడయ్యింది. దీంతో లీసెస్టర్ క్రౌన్ కోర్టు భారత సంతతి వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.