కరోనావైరస్ కారణంగా బీజేపీ ఎంపీ కన్నుమూత!

వాస్తవం ప్రతినిధి: కరోనావైరస్ కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల అశోక్ గస్తీ అనారోగ్యానికి గురికాగా.. ఆయన కరోనా పరీక్షలు చేయించున్నారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో… సెప్టెంబరు 2న కర్ణాటక బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యలతో అశోక్ గస్తీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

కర్ణాటక రాయచూర్‌కు చెందిన అశోక్‌ గస్తీ విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక నుంచి రాజ్యసభకు అశోక్‌ గస్తీ తొలిసారి ఎన్నికయ్యారు. జులై 22న ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, రాజ్యసభకు ఎన్నికైన మూడు నెలలలోపే, ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే ఆయన కన్నుమూశారు.