గుమ్మనూరు జయరాం పై విరుచుకుపడుతున్న టీడీపీ నేతలు

వాస్తవం ప్రతినిధి: ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం పై వరుసగా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మంత్రి కుమారుడికి ఈ ఎస్ ఐ స్కాం కు సంబంధించి ఏ 14 నిందితుడు బెంజి కారును బహుమతిగా ఇచ్చాడని, ఆ నిందితుడికి మంత్రిగారి కుమారుడికి ఉన్న సంబంధం ఏంటి అని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించడమే కాకుండా ఏసీబీ హెల్ప్ లైన్ కు కాల్ చేసి మీడియా సాక్షిగా ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ట్విట్టర్ ద్వారా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాం వెనుక అసలు పాత్రధారులు బయటపడ్డారని వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో అసలు పాత్రధారుడు వైసీపీ మంత్రి జయరాం అని వివరించారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడైన కార్తీక్ ను సొంత కొడుకులా భావించి అన్ని పనులు చేసిపెట్టాలని అధికారులను ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. తన శాఖలో అవినీతికి సహకరించని అధికారి ఉదయలక్ష్మిని శాఖ నుంచి తొలగించడానికి ఎందుకు ప్రయత్నించారని, కార్తీక్ కు బెయిల్ ఇప్పించమని మంత్రి జయరామ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలతో చేసిన పంచాయితీ ఏంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, మంత్రి జయరామ్ దోచుకున్న కష్టజీవుల సొమ్ము వెనక్కి రాబట్టాలని డిమాండ్ చేశారు.