రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..పలువురు బీజేపీ నేతల అరెస్ట్ లు!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అంతర్వేదికి వెళ్లేందుకు బీజేపీ నేడు ‘చలో అమలాపురం’కి పిలుపునిచ్చింది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల నేతలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు నిన్న సాయంత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి నేతలు వాహనాల్లో బయలుదేరారు.

అమలాపురంలో దాదాపు 600 మంది పోలీసులు రాత్రి నుంచి పహారా కాస్తూ, సరిహద్దులను మూసివేసి, లోపలికి ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా కోనసీమను దిగ్బంధించారు. కొందరు నేతలు పోలీసుల కళ్లుగప్పి పట్టణంలోకి రాగా, వారిని అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది.

ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు ఇదే కార్యక్రమానికి బయలుదేరిన విశాఖపట్నం బీజేపీ నేతలను కూడా నగరం శివార్లను కదలనీయకుండా చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా అనుకున్న కార్యక్రమాన్ని జరిపి తీరుతామని సోము‌ వీర్రాజు స్పష్టం చేశారు.

ఈ ఉదయం ఇదే కార్యక్రమానికి బయలుదేరిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ నేతలు భూపతిరాజు శ్రీనివాస వర్మను, ఉంగుటూరులో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణిని, తాడేపల్లి గూడెంలో నరిసే సోమేశ్వరరావును, పోలవరంలో కరిబండి నాగరాజు తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.