దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి: ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పై జరుగుతున్న దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా వరుసగా దేవాలయాలపై దాడులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు చోటుచేసుకోవడాన్ని నిరసిస్తూ రేపు ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు. దుర్గగుడి రథంపై నున్న సింహాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాయమయ్యాయని… దీనికి గత టీడీపీ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమవుతున్నామని, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో కార్యాచరణను సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు