మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి మృతి

వాస్తవం ప్రతినిధి: మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి విలియం హెన్రీ గేట్స్ II (94) సోమవారం కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హుడ్ కెనాల్‌లోని తన బీచ్ హోంలో సోమవారం మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

అతను 1925 నవంబర్ 30 న వాషింగ్టన్ లోని బ్రెమెర్టన్ లో జన్మించాడు. అతడిరి కుమారుడు బిల్ గేట్స్ తో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపనలో హెన్రీ గేట్స్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కారణంగానే ఈ ఫౌండేషన్ ద్వారా బాలల రోగనిరోధక శక్తిని పెంచడానికి, పోలియో నిర్మూలనకు, ఆఫ్రికన్ రైతులకు విత్తనాలు అందించడానికి, అమెరికన్ ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి 50 బిలియన్ డాలర్లకు పైగా నిధులు అందజేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో కూడా ఈ ఫౌండేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది

తన తండ్రి మరణం ఎంతగానో బాధిస్తుందని బిల్ గేట్స్ అన్నారు. ‘నా తండ్రి నిజమైన బిల్ గేట్స్. నేను ఆయనను ప్రతిరోజూ కోల్పోతాను. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించడంలో ఆయన పాత్ర చాలా కీలకం’అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.‘మా ఫౌండేషన్ ఏర్పాటులో నా తండ్రి ప్రభావం చాలా పెద్దది. సమయాన్ని మరియు వనరులను వాడుకుంటూ ఎలా బతకాలో ఉదహరణతో సహా నాకు నా తల్లిదండ్రులు నేర్పించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ రోజు నాన్న లేకపోతే ఉండేది కాదు. ఫౌండేషన్ విలువలను అందరికంటే ఎక్కువగా ఆయనే రూపొందించాడు’ అని బిల్ గేట్స్ తెలిపారు.