కరోనా వ్యాక్సిన్ పై ట్రంప్ కీలక ప్రకటన..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ విషయమై ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రకటనలు చేస్తున్నారు. ఇదివరకే నవంబర్‌లో వ్యాక్సిన్ వచ్చేస్తుందని, అమెరికా ఎన్నికలు జరుగనున్న నవంబర్ 3 కంటే రెండు రోజుల ముందు వ్యాక్సిన్ విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ వ్యాక్సిన్‌ విడుదలపై మరో ప్రకటన వెలువడింది. మంగళవారం ఫిలడెల్ఫియాలోని టౌన్ హాల్‌లో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ వచ్చే మూడు నాలుగు వారాల వ్యవధిలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల కంటే ముందే పంపిణీ చేస్తామని తెలిపారు.

ఇది ఇలా ఉంటే.. ఈసారి కరోనా ప్రభావం పోలింగ్‌పైనా ఉండొచ్చంటున్నారు. కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌లు సకాలంలో చేరుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేకపోయిన వారు అబ్సెంటీ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలో అబ్సెంటీ బ్యాలెట్‌ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా ఫలితాలు రావడానికి రాత్రి 10 గంటలు దాటొచ్చని భావిస్తున్నారు.